విభజన చట్టంలో 90శాతం హామీలు నెరవేర్చాం : అమిత్‌షా

రాజమండ్రి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 90శాతం హామీలను మోదీ సర్కార్ నెరవేర్చిందని భారతీ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రిలో జరిగిన శక్తి కేంద్రాల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్ జవానులు అమరులు కావడం చాలా బాధాకరమని అమిత్‌షా అన్నారు. జవానుల కుటుంబాలకు అందరం బాసటగా నిలవాలని అమిత్‌షా పేర్కొన్నారు.

ప్రధాని మోది దేశ భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారనీ, ఉగ్రదాడి తిప్పికొట్టేందుకు భారత సైనికులకు మోది పూర్తి స్వేచ్చ ఇచ్చారని షా అన్నారు.

సైనికుల మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేసి బిజెపిపై బురద చల్లాలని చూస్తున్నదని అమిత్‌షా విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం వదిలి పెట్టి బెంగాల్, ఢిల్లీలకు వెళ్లి ధర్నాలు చేయడం కాదు, రాష్ట్రంలోని ఆయన పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని వంచించిన కాంగ్రెస్‌ పార్టీతో నేడు చంద్రబాబు జత కట్టారనీ, ప్రజలు ఇది చూసి ఆయన్ను అసహ్యించుకుంటున్నారని అమిత్‌షా అన్నారు.

కేంద్రంలోని మోది సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందనీ, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఐదేళ్లలో సంపూర్ణం చేసిన విషయం తెలుగు ప్రజలు గుర్తించాలని అమిత్‌షా అన్నారు.

మోది ప్రభుత్వం రాష్ట్రానికి 20 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఇచ్చిందని అన్నారు.

రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున సహకారం అందిస్తే నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ కేంద్రంలోని బిజెపిపై చంద్రబాబు అభాండాలు వేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు.

రాజమండ్రి ఎయిర్ పోర్టు అభివృద్ధి 180కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

రాష్ట్రంలోని టిడిపి, వైసిపిలు రెండు వారి కుటుంబానికి మేలు చేసుకునే పార్టీలే కానీ ప్రజలకు మేలు చేసేవి కావని అమిత్‌షా విమర్శించారు.

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుండి 55.475కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని అమిత్‌షా స్పష్టం చేశారు.

చంద్రబాబు మోసాల చరిత్ర ప్రజలందరికీ తెలుసుననీ, ముందు మామ ఎన్‌టిఆర్, తరువాత వాజ్‌పేయి, నేడు మోదిలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమిత్‌షా విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని అమిత్‌షా హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.