‘అన్నీ అబద్దాలే’

అమరావతి, ఫిబ్రవరి 22: ఆయన ‘అమిత్‌షా’ కాదు అబద్దాల ‘షా’ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం రాజమండ్రి సభలో ముఖ్య మంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలకు చేశారు.

శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో అమిత్‌షా వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

అమిత్ షా నిన్న పచ్చి అవాకులు చవాకులు పేలారనీ, రాష్ట్రానికి గత ఐదు ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదని చంద్రబాబు అన్నారు. అమిత్ షా పచ్చి అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రానికి బిజెపి చేసిందేమీ లేకపోగా, ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం కూడా బిజెపి నేతల్లో లేదని చంద్రబాబు అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

‘ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చారా, విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇచ్చారా, కడపలో స్టీల్ ప్లాంట్‌కు  నిధులిచ్చారా, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్ పెట్టారా, ఏం చేశారని 90శాతం లెక్క చెబుతున్నారు.’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇచ్చిన 350కోట్ల రూపాయలు ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రంపై నరేంద్రమోది,అమిత్ షాలు కక్ష కట్టారనీ, పగ- ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

‘మోసాలు చేస్తోంది మీరు, కుట్రలు చేస్తోంది మీరు, ఎవరు దేశానికి ద్రోహులో ప్రజలే తేలుస్తారు.’ అని చంద్రబాబు అన్నారు.