Amit Shah: నిజాంపై అలుపెరగని పోరాటం అచంచల దేశ భక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. శనివారం ఉదయం సీఆర్పీఎఫ్ సెక్టార్ నుండి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అమిత్ షా భద్రతా బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకల్లో అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విముక్తి కోసం పోరాటం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నానని పేర్కొన్న అమిత్ షా .. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. రావి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బుర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నివాళులర్పిస్తున్నానన్నారు.
అపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారని అన్నారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారని గుర్తు చేశారు. పటేల్ లేకపోతే తెలంగాణ కు అంత త్వరగా విముక్తి లభించేది కాదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరించారన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలు వాళ్లను క్షమించరని అన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించిందని అన్నారు అమిత్ షా. పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్ షా పంపిణీ చేశారు. అయితే అమిత్ షా తన ప్రసంగంలో బీఆర్ఎస్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేయకపోవడంపై చర్చనీయాంశం అయ్యింది.
Amit Shah: ప్రముఖ బ్యాడ్మింటన్ పీవీ సింధు క్రీడా ప్రతిభను ప్రశంసించిన అమిత్ షా