వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పార్టీ మరో షాక్ ఇచ్చింది. వైసీపీ సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పై పార్టీ వేటు వేసింది. గిరిధర్ రెడ్డి నుండి పార్టీ నుండి తొలగిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ అందించిన సిఫార్సుల మేరకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఇప్పటికే పార్టీకి దూరమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని పార్టీ నియమించింది. గిరిధర్ రెడ్డి పై పార్టీ వేటు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మరో సారి మీడియా ముందుకు రానున్నారు.

వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడైన కోటంరెడ్డి .. రెండు సార్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ మరి విడత మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందని కోటంరెడ్డి ఆశించారు. అయితే ఆ జిల్లా నుండి కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ క్రమంలోనే తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేస్తూ వైసీపీకి దూరమైయ్యారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనంటూ కూడా కోటంరెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గిరిధర్ రెడ్డి పై పార్టీ వేటు వేసిన నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.