బాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. కొన్ని నెలల కిందట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ శోకం ఇంకా పూర్తిగా తీరకమునుపే మరో యువ నటి మరణించడం బాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. “డర్టీ పిక్చర్” సినిమాలో నటించిన ఆర్య బెనర్జీ (33) శుక్రవారం ఉదయం అనుమానాస్పద ష్టితిలో మరణించారు. కోల్కతాలోని ఆమె నివాసంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పనిమనిషి ద్వారా విచారణ మొదలు..!!
ఆమె నివాసంలో ఒంటరిగానే ఉంటున్నారు. రోజు వారీ లాగానే ఈరోజు కూడా పనిమనిషి ఆమె ఇంటికి పని చేసేందుకు వెళ్లారు. ఫోన్ చేసినా, డోర్ బెల్ కొట్టినా ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి, తలుపులు పగలకొట్టి మృతదేహాన్ని గుర్తించారు. ముఖంపై రక్తపు గాయాలు ఉండడంతో ఈ మృతిపై అనేక కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణలో భాగంగా ఆమె ఫోన్ కాల్ డేటా, చివరి వారం రోజులు జరిగిన షూటింగ్ వివరాలు, ఆమె సన్నిహితులు విషయమై ఆరా తీస్తున్నారు.
* ఆమె నివాసంలో ఎప్పుడూ ఒంటరిగా ఉంటుందని పని మనిషి చెప్తున్నారు. ఆర్య ఇంట్లో ఆమె వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా పోలీసులు గుర్తించారు. నివాసంలో నేలపై కొన్ని రక్తపు చుక్కలు గమనించారు. ఈ ప్రాధమిక సమాచారం, ఆధారాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి, తమకు లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులకు సవాలుగా మారింది. అనేక కోణాల్లో విచారిస్తున్నారు.