రైతాంగ ఉద్యమాల నేపథ్యంలో…ఎన్‌డీఏకి మరో భాగస్వామ్య పార్టీ హెచ్చరిక

 

 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పంజాబ్, హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన రోజే ఎన్డీఏ భాగస్వామ్యంలోని అకాళీదళ్ మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా త్యజించి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో    భాగస్వామ్య పక్షాలతో పని లేకుండానే బీజేపీకి 303 స్థానాలు ఉండటంతో అకాళీదళ్ బయటకు వెళ్లినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరో భాగస్వామ్య పార్టీ కూడా బయటకు వెళ్తామంటూ హెచ్చరిస్తోంది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) డిమాండ్ చేస్తున్నది. ఆర్ ఎల్ పీ అధినేత హనుమాన్ బెనీవాల్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

 

“మిస్టర్ అమిత్ షా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం. ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోండి, స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయండి. ఢిల్లీలో నిరస చేపట్టిన రైతులతో వెంటనే చర్చలు జరపండి. ఆర్ ఎల్ పీ అనేది ఎన్ డీ ఏలో ఒక భాగస్వామి. కానీ రైతులు, జవాన్లు వల్లే మనకు అధికారం దక్కింది. ఈ అంశానికి సంబంధించి వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే నేను ఎన్ డీ ఏ లో కొనసాగడంపై పునరాలోచించుకోవాల్సి వస్తుంది” అని బేనీవాల్ హెచ్చరించారు. దీనిపై అమిత్ షా ఇంత వరకూ స్పందించలేదు.

 

హర్యానా, పంజాబ్ రైతుల ఆందోళనల నేపథ్యంలో చర్చలకు సిద్ధం అంటూ కేంద్రం వెల్లడించింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాత్రం రైతాంగ ప్రయోజనాలపై అన్నీ ఆలోచించే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామంటూ మరో సారి పునరుద్ఘాటించారు.