దమ్మాలపాటికి సుప్రీంలో షాక్..ఏపి హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై స్టే

 

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం అప్పటి వరకూ ఈ కేసును ఫైనల్ చేయవద్దని ఏపి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి భూ కుంభకోణంకు సంబందించి దమ్మాలపాటి శ్రీనివాస్‌తో సహా 13మందిపై ఏసిబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దమ్మాలపాటి ఏపి హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తుపై స్టే ఇస్తూ ఎఫ్ఐఆర్ వివరాలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదంటూ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా నేడు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. నేరం జరిగిన తరువాత దర్యాప్తు చేయవద్దా ? దర్యాప్తు వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు, ఏదీ జరగకడదా ? తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి ఎలా వర్తింపజేస్తారు, పిటిషనర్ అడకకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని అని ప్రభుత్వం తరపు న్యాయవాది ధావన్ సుప్రీం ధర్మాసనం ఎదుట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏపి హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.