చంద్రబాబుపై చర్యలకు ఏపి అసెంబ్లీ తీర్మానం..సరైన సమయంలో చర్యలకు స్పీకర్ హామీ

 

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఏపి అసెంబ్లీలో అధికారపక్షం తీర్మానం చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం ఆరోపించింది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. సభ్యుల తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామనీ, సరైన సమయంలో సరైన నిర్ణయం, చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

 

చంద్రబాబు ప్రవర్తనను స్పీకర్ తమ్మినేని సీతారాం  కూడా తప్పుబట్టారు. ఇటువంటి దురదృష్టకమైన పరిణామం తానెప్పుడూ చూడలేదని స్పీకర్ తమ్మినేని అన్నారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. ప్రతిపక్ష నేత కన్ ఫ్యూజన్‌లో పడ్డారని స్పీకర్ అన్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని శాసనసభను రేపు ఉదయానికి వాయిదా వేశారు.

 

కాగా తొలి రోజు సభలో అధికారపక్షం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.