ఏపి అసెంబ్లీలో రెండవ రోజు రగడ..టీడీపీ సభ్యుడు రామానాయుడు సస్పెన్షన్

 

ఏపి శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండవ రోజు మంగళవారం కూడా రగడ జరిగింది. టిడ్కో ఇళ్ల పంపిణీపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. సభా సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగలడంతో సీఏం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను ఎత్తిపడేయండి అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం పలు మార్లు మందలించారు. అయినా వారు పోడియం నుండి వెనక్కు వెళ్లకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ టిడ్కో ఇళ్ల పంపిణీపై చర్చకు పట్టుబట్టారు. ఉద్దేశపూర్వకంగా, కుట్రధోరణితో సభను తప్పుదోపట్టించడం, సభా సమయం వృధా చేయడం, ఇబ్బందికల్గించడం చేస్తున్నందున టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడును సభ నుండి ఒక రోజు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను సభ ఆమోదించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిమ్మల రామానాయుడును ఒక రోజు సమావేశాల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణం బయటకు వెళ్లిపోవాల్సిందిగా రామానాయుడును స్పీకర్ ఆదేశించారు. అయినా ఆయన నినాదాలు చేస్తుండటంతో రామానాయుడును బయటకు పంపించాల్సిందిగా అసెంబ్లీ మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు.