రైల్వే జోన్‌పై బిజెపి నేతల పట్టు

76 views

ఎన్నికలకు వేళ విశాఖ రైల్వే జోన్ అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఏపి బిజెపి నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో శనివారం భేటీ అయ్యారు.

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,ఎమ్‌పీలు జీవిఎల్ నరసింహ రావు, కంభంపాటి హరిబాబు, బీజేపీ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి,ఎమ్‌ఎల్‌ఏ విష్ణుకుమార్ రాజు, ఎమ్‌ఎల్‌సి మాధవ్‌లు ఢిల్లీలో గోయల్‌ను కలిశారు. విభజన చట్టంలో ప్రస్తావించిన రైల్వే జోన్ ఏర్పాటు హామీ ఇప్పటి వరకూ నెరవేర్చకపోవటంపై నేతలు గోయల్ తో చర్చించారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చించారు.

భేటీ అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్‌ అంశంపై గోయల్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. మార్చి 1న ప్రధాన మంత్రి విశాఖకు వస్తున్నందున మరోసారి రైల్వే శాఖ మంత్రిని కలిశామని, రైల్వేజోన్ పై ఉన్న సెంటిమెంట్‌ను రైల్వే మంత్రికి వివరించామని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏపీకి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.