బీజేపీ ఏపీ టార్గెట్ ‘ జగన్ పీఠం ‘ దానికోసం కొత్త స్కెచ్ ఇదే !

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన త‌ర్వాత సోము వీర్రాజు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు గుర్తుండే ఉంటుంది.

“ఏపీ బీజేపీ రాబోయే ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్ట‌బోతోంది“ అంటూ ఆయ‌న చేసిన కామెంట్లు స‌హ‌జంగానే కొంత క్రేజ్‌కు కొంత చ‌ర్చ‌కు దారితీశాయి. అయితే, నిజంగా ఏపీ బీజేపీకి అంత సీన్ ఉందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారం చేజిక్కించుకునే అంత కాక‌పోయినా…కొంత సీన్ అయితే ఉంద‌ని అంటున్నారు.

అస‌లు కిటుకు చెప్పిన వీర్రాజు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామనీ, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారనీ, తాము కూడా ఆయనను ఆవిధంగానే చూస్తామని సోము వీర్రాజు అన్నారు. ఇక్క‌డే వీర్రాజు వ్యూహం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్తున్నారు.

అప్పుడు లైట్ తీసుకున్నారు..

పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మ‌యంలో పార్టీ నేత‌ల్లో జోష్ పెంచేందుకే అలా మాట్లాడారు అంటూ…మొద‌ట్లో సోము వీర్రాజు మాట‌ల‌ను ఏపీ ప్ర‌జ‌లు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం బీజేపీ అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో లెక్క‌లు మారుతున్నాయంటున్నారు. పార్టీ తప్ప మరేమీ పట్టని సోము వీర్రాజుకు బీజేపీ ర‌థ‌సార‌థిగా పట్టం కట్టిన త‌ర్వాత‌ సోము వీర్రాజు మ‌రింత‌ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆంద్ర‌ప్ర‌దేశ్‌‌లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు అనేక‌మంది భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా గాయ‌ప‌రుస్తున్నాయని నిన‌దిస్తున్నారు సోము వీర్రాజు.

ఏపీలో ఇప్పుడేం జ‌రుగుతోందంటే….

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ హిందువులు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడంతా వారి మ‌నోభావాల గురించే చ‌ర్చ‌. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనతో వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. అయితే, హిందువుల ఎజెండాతో ముందుకు సాగాల‌ని ఏపీ బీజేపీ డిసైడ‌న‌ట్లు తెలుస్తోంది.

ప్లాన్ అమ‌లు జ‌రుగుతోంది ఇలా

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు పార్టీ బ‌లోపేతానికి త‌న వంతు కృషి చేస్తున్నారు. ఓ వైపు క్షేత్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు తెలియ‌జేస్తూనే మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రిచంద‌న్‌ను క‌లిసి ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను గవర్నర్ కు సోము‌ వీర్రాజు వివరించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవ‌డం బీజేపీ త‌ర‌హా ఒక మ‌తానికి `బ‌హిరంగంగా` మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీకి సాధ్యం కాక‌పోవ‌చ్చు. అయితే, బ‌ల‌మైన హిందు ఓట్ల‌లో కొంత చీల్చినా… ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న టీడీపీ బ‌ల‌హీనం అవుతుంది. ఆ స్థానంలోకి బీజేపీ చేరుతుంది. త‌ర్వాత అధికార పీఠంపై గురి పెట్ట‌వ‌చ్చు అంటూ బీజేపీ పెద్ద‌లు లెక్కేసుకుంటున్నార‌ట‌. ఈ లెక్క‌ల ద్వారా స్థూలంగా బొక్క ప‌డేది… టీడీపీకే.