బిజెపి బిక్షాటనతో నిరసన

అమరావతి: ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ అన్నారు. నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు పట్నం బజారులో జరిగిన నిరసన కార్యక్రమానికి కన్నా హజరై జోలె పట్టి బిక్షాటన చేశారు.

జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకువచ్చినా ఎక్కడా ఇసుక అందుబాటులో లేదని కన్నా అన్నారు. రాష్ట్రంలో వేలాది నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు పని లేకుండా పోయిందనీ ఇందుకు జగన్ విధానాలే కారణమనీ కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు పది వేల రూపాయల వంతున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని కన్నా డిమాండ్ చేశారు.