‘నివర్ తుఫాను‌.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’

 

నివర్ తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. నివర్ తుఫాను నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుఫాను నేరుగా ఏపికి తాకకపోయినా తమిళనాడు చేరువలోనూ, సముద్ర తీర ప్రాంతాల్లో దాని ప్రభావం ఉంటుందని జగన్ అన్నారు. భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం అంతా తుఫాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారని అన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 11-20 సెంటీ మీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే గంటకు 65 నుండి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిందని సిఎం అన్నారు.

పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గత నెలలో కురిసిన వర్షాలతో చెరువులు, రిజర్వాయర్‌లు అన్ని నిండి ఉన్న కారణంగా మళ్లీ వర్షాలు పడితే చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉంటాయనీ కావున గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అదే విధంగా కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశా నిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో, మండల కేంద్రాల్లో రోజంతా పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నెల్లూరు నుండి తూర్పు గోదావరి వరకూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎక్కడైనా చెట్లు విరిగిపడితే వెంటనే వాటిని తొలగించేలా తగిన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా తుఫాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్ లెట్స్ ను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుండి కలెక్టర్‌లు, ఎస్‌పీలు పాల్గొన్నారు.