CM YS Jagan Delhi Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సర్కార్ అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తీవ్ర సంచలనం అయ్యింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరో మూడు నాలుగు కేసులు తెరపైకి వచ్చాయి. మొదటి సారిగా రోజుల తరబడి చంద్రబాబు కారాగార వాసం గడపాల్సి పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంతో ఆయన తనయుడు నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీకి పయనమైయ్యారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయపోరాటం కోసం న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్న నారా లోకేశ్ .. మరో పక్క కేంద్ర పెద్దలను కలిసి ఏపీలో పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారుట. కానీ రెండు వారాలకుపైగా ఢిల్లీలోనే లోకేశ్ ఉన్నా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లు ఖరారు కాలేదు.

చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర పెద్దల మద్దతు ఉందన్న ప్రచారాన్ని టీడీపీ ఖండించలేకపోతున్నది. ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలోనే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీకి జై కొట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా టీడీపీతో పొత్తు ప్రకటన చేసేశారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం జగన్ రేపు (గురువారం) ఢిల్లీకి వెళుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటి సారిగా జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో భేటీ అవుతుండటంతో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది.

వాస్తవానికి జగన్ ఢిల్లీ టూర్ గత నెలలో జరగాల్సి ఉంది. జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సెప్టెంబర్ 14న ఢిల్లీకి వెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే నాడు కేంద్ర పెద్దల తో అపాయింట్మెంట్ లు ఖరారు కాకపోవడంతో జగన్ ఢిల్లీ టూర్ అగిపోయిందని అనుకున్నారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఈ సారి జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు రోజుల జగన్ టూర్ లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, హర్ దీప్ సింగ్ పూరిని కూడా కలుస్తారని అంటున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం అందుతోంది.

జగన్ ఢిల్లీ పర్యటన కారణంగానే గురువారం సామర్లకోటలో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేంద్ర పెద్దలతో చర్చించడంతో పాటు ముందస్తు ఎన్నికలపైనా సలహా తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే కఛ్చితంగా మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు జైల్ లో ఉండటంతో ఆ పార్టీ అయోమయ పరిస్థితిలో ఉంది.
టీడీపీ – జనసేన పొత్తు ప్రకటన చేసినా ఇంకా పూర్తి స్థాయిలో ఇరుపార్టీల నేతలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో రాజకీయ వ్యూహంతో వైసీపీ ముందుకు వెళ్లే అలోచన ఉందని అంటున్నారు. కేంద్ర పెద్దలు లోకేశ్ కు అపాయింట్మెంట్ లు ఇవ్వకుండా దూరం పెట్టడం వైసీపీకి కలిచి వచ్చే అంశంగా కూడా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
PM Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు