ఏపి సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో భేటీ

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేటి మద్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవ్వనున్నారు.  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించే అవకాశం ఉంది.

ap cm ys jagan moham reddy delhi tour

రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకొంది. నాలుగు నెలల క్రితం అంతర్వేధిలో రథం దగ్ధం కేసును సీబీఐ దర్యాప్తునకు ఇచ్చినా ఇంత వరకూ దర్యాప్తు ప్రారంభం కాలేదు. ఈ దర్యాప్తు అంశంపైనా అమిత్ షాతో జగన్ మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై అమిత్ షా కు జగన్ వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రతిపక్షాల కుట్ర కోణం దాగి ఉందని ఇప్పటికే ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీటికి సంబంధించి సీఐడి నివేదికను అమిత్ షాకు అందజేసే అవకాశం ఉంది. మరో పక్క ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపులపైనా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.