పోలవరం ప్రాజెక్టు నిధులకై పీఎం మోడీకి ఏపి సీఎం జగన్ లేఖ

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు చేసిన సవరణలను ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యల పైన కేంద్రం సారించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారు  నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ లేఖ లో ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరారు. పోలవరం నిధుల  విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 2014 ఏప్రిల్ 29 క్యాబినెట్ తీర్మానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టిందనీ, కేంద్రం రూ.8,507 కోట్లు చెల్లించిందని ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.  ప్రాజెక్టు పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని 2017 మే 8న కేంద్ర జలవనరుల శాఖ లేఖలో తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం కేంద్రం కొత్త షరతులు తెస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుందని అన్నారు. ఇప్పుడు నిధుల జాప్యం చేస్తే అంచనా వ్యయం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 2013-13 ప్రకారం కేవలం 20,398 కోట్లు మాత్రమే ఇస్తామని ఇప్పుడు అంటున్నారనీ కానీ పునరావాసం, భూసేకరణకే రూ.28,191 కోట్లు ఖర్చు అవుతుందని ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందని ప్రశ్నించారు. ప్రధానిగా తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక, జలశక్తిమంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి అయ్యేలా సహకరించి ప్రాజెక్టును  2021 డిసెంబర్ నాటికి జాతికి అంకితం చేయాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.