విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ – 20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో అధికార యంత్రాంగం గత ప్రభుత్వ హయాంలో ఏడాది సగటు పెట్టుబడులు, ఈ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల లెక్కలను వివరించారు. 2014 – 2019 మధ్య 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్య కాలంలో గ్రౌండ్ అయిన పెట్టుబడులలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక 2019 – 2022 మధ్య గ్రౌండ్ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి పెట్టుబడులు రూ.25,693 కోట్లు వచ్చాయని వివరించారు. 2019 నుండి ఇప్పటి వరకూ ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా, ఈ పెట్టుబడులు అన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయనీ, వీటి ద్వారా లక్షా 40వేల 903 మంది కి ఉద్యోగ కల్పన జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పెట్టుబడులు లక్ష్యంగా సదస్సులు మందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్న అపార వనరులను సమగ్రంగా వివరించేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపి వేదిక కావాలని చెప్పారు. దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇవ్వాలన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పారిశ్రామిక వాడలను అధికారులు పరిశీలించి వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సీఎం జగన్ సూచించారు. అలానే ఆయా దేశాల్లో ఎంఎస్ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ తెలిపారు. అక్కడి నిర్వహణ పద్దతులను మన రాష్ట్రంలో అవలంబించడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
విశాఖలో జీ – 20 సన్నాహక సదస్సు కు గానూ ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం జగన్ సమీక్ష జరిపారు. ప్రపంచ దేశాల నుండి 250 మంది ప్రతినిధులు ఈ సన్నాహక సదస్సుకు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం కోసం విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాకుండా అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యచరణ చేయాలని తెలిపారు. వివిధ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లపై ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ఈ సమావేశానికి హజరయ్యే ప్రతినిధుల సౌలభ్యం కోసం ఒక మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.