రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నవంబర్ ఒకటవ తేదీ నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని జగన్ కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామనీ, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలనీ జగన్ ఆకాక్షించారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి సాయంత్రం జరిగే వేడుకల్లో ముఖ్య అతిధులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సిఎం జగన్ పాల్గొంటారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని జండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చల్లా మధుసూధన్ రెడ్డి, పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, వైసిపి నేతలు పాల్గొన్నారు.