నవంబర్ 2 నుండి ఏపిలో పాఠశాలల పునః ప్రారంభం..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కరోనా ఉదృతి కారణంగా రాష్ట్రంలో  విద్యాసంవత్సరంలో పాఠశాలలు ఇంత వరకూ పునః ప్రారంభం కాలేదు. అన్ లాక్ 5లో భాగంగా పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై నిర్ణయాధికారిన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై ఏపి ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుండి బడులను తెరవనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించారు.

సీఎం వైఎస్ జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్‌లు, ఎస్‌పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా పాఠశాలల పునః ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించిన జగన్.. రెండు రోజులకు ఒక సారి తరగతులు చొప్పున నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  1,3,5,7 తరగతి విద్యార్థులకు ఒక రోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించాలని జగన్ తెలిపారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750 కంటే ఎక్కువగా ఉంటే మూడు రోజులకు ఒక సారి తరగతులు నిర్వహించాలని తెలిపారు. తరగతులను మధ్యాహ్నం వరకు మాత్రమే నిర్వహించాలనీ, పాఠశాలలో మధ్యాహ్న భోజనం తరువాత విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు.

నవంబర్ నెల మొత్తం ఈ విధంగా పాఠశాల తరగతులను నిర్వహించి డిసెంబర్ నెలలో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఒక వేళ తల్లిదండ్రులు కరోనా భయంతో పిల్లలను స్కూళ్లకు పంపడానికి ఇష్టపడకపోతే వారి కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.