ఇటీవల నెల్లూరు జిల్లాలో చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేదం విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీ, లేదా పోలీస్ కమిషనర్లు కఛ్చితమైన షరతులతో అనుమతులు ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణతో ప్రజలకు అసౌకర్యం కల్గిస్తుండటంతో పాటు వాటి నిర్వహణలో లోటు పాట్లు, నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతునన్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సభల నిర్వహణకు రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాల్లో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలకు ప్రత్యామ్యాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి ఇవ్వనున్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వం.. షరతులను ఉల్లంఘిస్తే నిర్వహకులపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రతిపక్ష పార్టీలకు బిగ్ షాక్ గా మారింది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అంటూ రోడ్ షోలు నిర్వహిస్తుండగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి త్వరలో కుప్పం నుండి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కోర్టులో సవాల్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తొంది. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ల రోడ్ షో లకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేయగా వీరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన సంగతి తెలిసిందే. అయితే ఏపిలో మాత్రం రెండు దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.