సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది.  ఈ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్న కారణంగా ఆ శాఖ వారితోనే విచారణ చేయించడం సమంజసం కాదని పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు. అలా చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సలాం కుటుంబం సెల్ఫీ వీడియోను పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పోలీసుల  తరపున ఏఏపజీ సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన పాణ్యం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వీరు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపడంతో ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను విచారణ అధికారులుగా నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్‌పై విడుదల అయ్యారు. అరెస్టు అయిన 24గంటల్లోపే వారికి బెయిల్ లభించడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ వారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏపి ప్రధాన కార్యదర్శి కాజావలి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.