వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపి హైకోర్టు ఇవేళ విచారణ జరిపింది. ఈ సందర్భంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ అభ్యర్ధిగా నర్సాపురం నుండి విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు గెలిచిన ఏడాది నుండే పార్టీ అధిష్టానాన్ని దిక్కరిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వంపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఆయనపై వేటు పడలేదు. ఈ క్రమంలోనే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ లతో పాటు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఐడీ కేసులు నమోదు అయ్యాయి.

వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో రఘురామ ఢిల్లీ, హైదరాబాద్ లకే పరిమితం అయ్యారు. ఓ సారి ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరు తరలించి వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఆ తర్వాత ఏపిలో అడుగుపెట్టలేదు. సొంత నియోజకవర్గానికి వచ్చేందుకు పలు మార్లు విఫలయత్నం చేశారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి రావడానికి భయపడుతూ అటు హైదరాబాద్, ఢిల్లీలోనే ఉంటున్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వంపై, జగన్మోహనరెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు నిర్ణయించుకున్న రఘురామ ..తనపై రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ డీజీపీకి లేఖ రాశారు. దీనిపై స్పందన రాకపోవడంతో ఏపి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఇవ్వడం లేదనీ, దీంతో ఏ కేసులో అరెస్టు చేస్తారో తెలియడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రఘురామ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున హోంశాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మానవేంద్ర నాథ్ రాయ్ .. ఉమేష్ చంద్ర వాదనలకు ఏకీభవిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. రఘురామ కృష్ణంరాజు పై ఉన్న ఎఫ్ఐఆర్ లు, రిజిస్టర్ కాని ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరంగా తనకు ఉన్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామ కృష్ణంరాజుకు అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణ ను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.