డాక్టర్ రమేష్ కు ఏపీ హైకోర్టు షాక్… కష్టడియల్ విచారణకు అనుమతి..!

 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు ను విచారణ చేసేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ బాబును కష్టడియల్ విచారణ నిర్వహించేందుకు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు మంజూరు చేసింది. నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలలో పేర్కొన్నది.

ఈ ఏడాది ఆగస్టు 9న విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి పదిమంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై డాక్టర్ రమేష్ తో పాటు మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీస్ లు ప్రయత్నించగా పరారీలో ఉండి ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాంమోహన్ లు హైకోర్టును ఆశ్రయించగా, వారి పై తదుపరి చర్యలు అన్ని నిలుపు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు.. హైకోర్టు ఉత్తర్వులను కొట్టి వేస్తూ కేసు విచారణ ను అనుమతులు ఇచ్చింది. పోలీస్ విచారణకు సహకరించాలని డాక్టర్ రమేష్ బాబుకు ఆదేశించింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ ప్రారంభించిన పోలీసులు డాక్టర్ రమేష్ ను విచారణ కు హాజరు కావాలని రెండు నెలల క్రితం సీఆర్పీసీ 160 కింద నోటీస్ లు జారీ చేశారు. అయితే కోవిడ్ ఉధృతి నేపథ్యంలో తాను ఆన్ లైన్ విచారణ కు హాజరు అవుతానని సమాధానం ఇచ్చారు. విచారణకు రమేష్ బాబు సహకరించని నేపథ్యంలో డాక్టర్ రమేష్ బాబు ను కష్టడియల్ విచారణకు అనుమతులు ఇవ్వాలని పోలీసులు కోర్టు ను ఆశ్రయించగా అనుమతులు ఇచ్చింది.