కొడాలి హిందూ వ్యాఖ్యల వెనుక అతి పెద్ద వ్యూహం..!!

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కొడాలి నాని అతి పెద్ద రిస్క్ చేశారు. వైసీపీకి, జగన్మోహనరెడ్డికి అత్యంత కంకణబద్దుడుగా, నిబద్ధుడిగా ఉన్న మంత్రి కొడాలి నాని తన రాజకీయాన్ని, తన మంత్రి పదవిని రిస్క్‌లో పెట్టి బీజెపీతో తలపడుతున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధాన మంత్రి మోడిని, సోము వీర్రాజును ఎవ్వరినీ వదలకుండా ఉసి గొల్పుతున్నారు. బీజెపీ మొత్తం అతనిపై విరుచుకుపడుతుంటే వైసీపీ తరపున ఆయన ఒక్కడే బీజేపీకి కౌంటర్‌లు వేస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని హిందూవాదం వెనుక హిందూ దేవాలయాలు, టీటీడీ డిక్లరేషన్ వ్యాఖ్యల వెనుక అతి పెద్ద వ్యూహం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అదేమిటో పరిశీలిస్తే…

వైసీపీ పైనా, జగన్ పైనా మచ్చ రాకుండా తనపైకి

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్‌పై మాట్లాడటం, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం, విగ్రహాలు ధ్వంసం కావడం ఇదంతా గత వారం ఏపిలో రాజకీయ సంచనలానికి తెర తీసింది. ఒక రకంగా ఎన్నడూ వైసీపీని ఇబ్బంది పెట్టని బీజెపీ, జనసేన కలిపి వైసీపీని, జగన్‌ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నాయి. దీన్ని కొడాలి నాని తన వైపుకు తిప్పుకున్నారు. హిందూ వ్యతిరేకత, టీటీడీ డిక్లరేషన్ అంశాలపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జగన్‌పైనా, వైసీపీపైన వస్తున్న విమర్శలను తన ఒక్కడిపైన, తన నెత్తినపైన వేసుకున్నారు. తద్వారా ఆయన రాజకీయంగా రిస్క్ ఎదుర్కొని వైసీపీని, జగన్‌ని సేఫ్‌లో పడేశారు అనే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహం కూడా పక్కాగా అమలు చేశారు కాబట్టే ఇప్పుడు బీజెపీ టార్గెట్ మొత్తం కొడాలి నానిపై పడింది. కొడాలి నానిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలంటూ బీజేపీ ఏకంగా తీర్మానం చేసింది.

తిరుమలలోనూ అదే స్థాయి విమర్శలు…వెనక్కు తగ్గని నాని

కొడాలి నాని అక్కడితో ఆగలేదు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్‌తో పాటు తిరుమల వెళ్లారు. అక్కడ కూడా మరింత ఘటుగా బీజెపీని, ప్రధాని మోడీని కూడా వివాదంలోకి లాగేలా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడి తన భార్యతో సహా అయోధ్యకు వెళితే సీఎం జగన్ తన భార్యతో తిరుమల తిరుపతి వస్తారట. బ్రహ్మచర్యం తీసుకుని భార్యకు దూరంగా ఉంటూ పిల్లలు కుటుంబం లేని మోడీని భార్యను తీసుకుని అయోధ్యకు రమ్మని అనడం ఏమిటీ? కుటుంబము, బంధము, భార్య, ఇటువంటి బంధాలు అన్ని జగన్ భార్యను తీసుకుని రాకపోవడానికి కారణాలు ఏమిటి? ఇలా మోడికి, జగన్‌కు దంపతుల లింక్ ఏమిటో కొడాలి నానికే తెలియాలి. మొత్తానికి బీజేపీని ఎలాగైనా టార్గెట్ చేయాలి, అది పార్టీ మొత్తం, జగన్మోహనరెడ్డి మొత్తం కాకుండా తన ఒక్కడే బీజేపీని సింగిల్ హాండ్ తో టార్గెట్ చేసేలా కొడాలి నాని వ్యూహం వేసుకొని తనకు తాను రిస్క్‌లో పెట్టుకుని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వి వైసీపీని, జగన్‌ను, తన పార్టీని సేఫ్‌లో పెట్టినట్లు, అదే వ్యూహం అమలు చేసినట్లు చెప్పుకోవచ్చు.