ఏపీ ప్రజలకు ఎంత సహనమో..! ఇటువంటి మంత్రులను భరిస్తున్నారు..!!

ఎవరేమనుకుంటే అనుకోనీ… ఎన్ని తిట్టుకున్నా తిట్టుకోనీ.. ఈ సైట్ క్లోజ్ చేసేస్తే చేసేసుకోనీ.., నిందలు వేస్తె వేసుకోనీ… కానీ ఒక్క నిజాన్ని మాత్రం అంగీకరించాల్సిందే.! ఏపీ ప్రజలు భలే సహనవంతులు. ఎంతగా అంటే..!? సహనానికి ఒక సబ్జెక్టు, సెర్టిఫికేషన్ ఉంటె, దానిలో డబుల్ పీహెచ్ డీ చేసినంతగా..!! ఎందుకంటే..!?

ఒకరిపై ఒకరు నెట్టుకున్న ఎమ్మెల్యేలను భరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయలేని ఎమ్మెల్యేలను భరిస్తున్నారు. బూతులు మాట్లాడుతున్న మంత్రులనూ భరిస్తున్నారు. నోరు జారిన మంత్రులను భరిస్తున్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని ప్రతిపక్ష నాయకున్ని భరిస్తున్నారు. అన్నీ నేనే కట్టాను అంటూ సొంత డాబులు కొట్టుకునే ప్రతిపక్ష నేతని భరిస్తున్నారు. బైక్ పార్క్ చేసి, టోల్ ఫీజు కట్టడమనే ప్రధాన నాయకున్ని భరిస్తున్నారు. ఇక తాజాగా.., మరింత ఘోరంగా వాల్మీకి జయంతిని, గాంధీ జయంతిగా మార్చి నోటికొచ్చినట్టు మాట్లాడిన మంత్రినీ భరిస్తారు. భరించాలి. తప్పదు. ఎందుకంటే మనం ఏపీ ప్రజలం, ఇది ఏపీ రాజకీయం..!!

ఈరోజు గాంధీ జయంతట. పండుగగా జరుపుకున్నారట. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నారట..!! ఈ మాటలు విడ్డూరంగా, విచిత్రంగా ఉన్నాయి కదా..! సాక్షాత్తు మన మంత్రి గారి నోటి నుండి జాలువారాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం ఈ ఖ్యాతి గాంచారు. కర్నూలులో ఈరోజు ఓ వేదికలో ఆయన మాట్లాడుతూ.. “కర్నూలు జిల్లాలో ఈరోజు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలా ప్రకారంగా గాంధీ జయంతి ఈరోజు పండుగలా జరుపుకోడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు” అంటూ సదరు మంత్రిగారు తమ స్పీచ్ ని ముగించారు. ఇంకా చెప్పుకోడానికి ఏం లేదు. ఏపీ ప్రజలు సహనవంతులు. సుగుణ శీలులు. ఎంత కంపుని అయినా భరిస్తారు. ఎంత చెత్తని అయినా నెత్తిన పెట్టుకుంటారు. అన్నట్టు… ఈ రోజు ఈ పలుకులు పలికిన మంత్రిగారు గత నెలలోనే బాగా వార్తల్లోకెక్కారు. “ఈఎస్సై కుంభకోణంలో కుమారుడికి బెంజికారు” అనే ఒక రియాలిటీ షోలో కనిపించారు.