మందులో మతలబు ఉందా?? జగన్ సర్కారు సర్కస్ ఎందుకు??

 

పాలనలో ఊగిసలాట అయోమయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని సందిగ్ద అవస్థలోకి నెట్టేస్తుంది. పాలనలో అయోమయం ఉండకూడదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సూటిగా ఉండాలి. అప్పుడే ఇటు ప్రజలకు అటు కార్యనిర్వాహక వర్గానికి పాలన చేసే వారిపై నమ్మకం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మద్యం ధరల పెంపు తర్వాత తగ్గింపు నిర్ణయాలు ఇటు ప్రజలను అటు అధికారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అప్పటికప్పుడే పెంచడం తర్వాత మళ్లీ దాన్ని పునఃసమీక్ష పేరుతో తగ్గించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ప్రత్యేకంగా ఓనగురే ప్రయోజనం సున్నా.

చెబితే వినరా లేక తెలిసే చేస్తున్నారా??

ప్రభుత్వ ఆదాయంలో మద్యం వాటా 30 శాతం.. 2001-02 సంవత్సరాల మధ్య కేవలం 14.3 శాతంగా ఉన్న మద్యం ఆదాయం గత ఏడాదికి 30 శాతానికి చేరుకుంది. జీడీపీలో వ్యవసాయానికి 34 శాతం, పారిశ్రామిక రంగానికి 23 శాతం, సేవా రంగానికి 43 శాతం వాటా ఉంది. అలాగే రాష్ట్ర రెవెన్యూ లో వాణిజ్య పన్నుల తర్వాత అధికంగా ఆదాయాన్ని తెచ్చేది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. జగన్ ఎన్నికల హామీలో మద్యనిషేధం అమలు చేస్తామని ఇచ్చిన మాట మేరకు ఎక్సైజ్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహణను చేపట్టింది. ఇది తమిళనాడు విధానం. ఇంత వరకు బాగానే ఉన్నా మద్యం ధరలు అమాంతం పెంచేసింది. ధరల పెంపు వల్ల సామాన్యుడు మద్యం తాగడానికి దూరమవుతాడు అంటూ లాజిక్కు చెప్పడం ప్రజలకు అటు అధికార గణానికి అయోమయానికి గురి చేసింది. ముందు ధరల పెంపు వల్ల విపరీతంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ మార్గంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక మద్యం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో లభ్యం అవుతోంది. దీంతో మద్యం రాబడి భారీగా పడిపోయింది.మరోపక్క ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలకు ప్రతి నెల, జీతాలకు ఎక్కడో దగ్గర ఏదో మార్గంలో ప్రభుత్వఎం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు మద్యం ధరల పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా ప్రభుత్వానికి ఇది పెను భారం అవుతుందని హెచ్చరించిన ప్రభుత్వ పెద్దలు మొండిగా ముందుకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల క్వార్టర్ ఇయర్లో మద్యం ఆదాయం సుమారు 16 వేల కోట్ల మేర తగ్గిందని అంచనా. దీంతోనే రెండు నెలల గడువు తీరకముందే పెంచిన మద్యం రేట్లు మళ్లీ తగ్గించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.

సామాన్యుడుకి లేదు ఊరట..!

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న మద్యం ధరల తగ్గింపు నిర్ణయం సైతం సముచితంగా లేదు. కాస్త కాస్ట్లీ బ్రాండ్ లు తాగేవాడికి ఇది అనుకూలంగా ఉంది. సామాన్యుడు పేదవారు తాగే మద్యం ధరల తగ్గింపు లేకపోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాస్ట్లీ బ్రాండ్ మద్యం ధరలు ఎక్కువగా పెంచడం వల్ల వాటిని రాష్ట్ర మద్యం దుకాణాల నుంచి ఎవరూ కొనుగోలు చేయడం లేదు. గత నెలలో కాస్ట్లీ మద్యం బ్రాండ్ లు నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 92 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతోనే ప్రభుత్వం అత్యవసరంగా వాటి ధరలను తగ్గించినట్లు సమాచారం. అయితే వీటి ధరలను పెంచి రెండు నెలల్లోనే మళ్లీ తగ్గించడం వల్ల ముఖ్యమంత్రి తీరు పట్ల గందరగోళ పరిస్థితులు, ఆయన ఆయన నిర్ణయాల పట్ల అయోమయ పరిస్థితులు ఇటు ప్రజల్లో అధికారుల్లో కలుగుతున్నాయి.