కోర్టు తీర్పు రాకమునుపే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషనర్

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ ప్రభుత్వానికి గతంలో పెద్ద యుద్ధమే జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మరో ఆరు నెలల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తి అవుతుంది. అప్పటి వరకూ ఎన్నికలు జరగకుండా చూడాలనేది వైసీపీ ప్రభుత్వ యోచన. అలా చేస్తే ఒక్క ఎన్నిక కూడా నిర్వహించకుండా పదవీ విరమణ అయిన అధికారిగా నిమ్మగడ్డ నిలిచిపోతారు. అయితే కరోనా కారణంగా తాను వాయిదా వేసిన ఎన్నికలను తానే నిర్వహించాలన్న పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు నిమ్మగడ్డ. ఈ పిటిషన్ పై నిన్న, ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.

ఇది జరిగి 24గంటలు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది ఇటీవల హైకోర్టుకు విన్నవించారు. అంటే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదన్నది స్పష్టం అవుతోంది. అయితే హైకోర్టు.. ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషనర్ కోర్టుకు తెలియజేయాలని పేర్కొన్నది. గతంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ పూర్తి అయిన తరువాత కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి మాట మాత్రంగా కూడా తెలియజేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పై నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడం, ఆ తరువాత ఆయన పదవీ కాలాన్ని తగ్గించి తొలగించడం, తమిళనాడుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి కనకరాజ్ ను ఎస్ఈసీగా నియమించడం, తదుపరి నిమ్మగడ్డ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి తిరిగి తన సీటు దక్కించుకోవడం ఇవ్వన్నీ తెలిసిందే.

cm jagan vs ap cec war begins
jagan,sec

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే చెల్లదంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ఇంకా సుప్రీం కోర్టు విచారణలోనే ఉంది. కాగా కరోనా ఉదృతి తగ్గకపోయినా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ఈ నెల 28వ తేదీ జరిగే సమావేశంలో స్థానికి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కీలకం కానున్నయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరం.