అరుణాచల్‌లో ఆగని ఆందోళనలు

ఆందోళనకారులు అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. శాశ్వత నివాస దృవీకరణ పత్రాల జారీ విషయంపై స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.

శుక్రవారం నుంచి ఆందోళనలు చేపడుతున్నారు. ఈటా నగర్‌లో సుమారు 50 కార్లను తగులబెట్టారు, దాదాపు 100 వాహనాలను ధ్వంసం చేశారు. ఐదు సినిమా థియేటర్లకు నిప్పు పెట్టారు. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఆదివారం నిరసనకారులు అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ బంగళాను దగ్ధం చేశారు. పోలీసు డిప్యూటీ కమిషనర్ ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో ఎస్పీ స్ధాయి పోలీస్‌ అధికారికి గాయాలయ్యాయి.

ఘర్షణలు తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం సైన్యాన్ని రప్పించింది. ఈటా నగర్‌లో సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేశారు. కర్ఫ్యూ విధించారు.

నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో శాశ్వత నివాస ధృవీకరణ పత్రాల మంజూరులో ఎటువంటి చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.

రాష్ట్రంలోని నామ్‌సాయ్, చాంగ్‌లాంగ్ జిల్లాల్లో దశాబ్దాలుగా ఉంటున్న ఆరు సామాజిక వర్గాలకు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు అందించాలన్న జాయింట్ హై పవర్ కమిటీ సిఫారసులను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.