మార్చి 1 నుండి కేజ్రీవాల్ ఆమరణ దీక్ష

దేశ రాజధాని ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు మార్చి 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర హోదాను సాధించేంత వరకు దీక్షను విరమించబోనని… చావును ఎదుర్కోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.

‘ దేశమంతటా ప్రజాస్వామ్యం ఉంది, కానీ ఢిల్లీలో లేదు. ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ఆ ప్రభుత్వానికి అధికారమే ఉండదు. అందుకని మార్చి 1 నుంచి మేం ఉద్యమం చేపడుతున్నాం. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధించే వరకు నేను మార్చి 1 నుంచి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నానని’ ఆయన ప్రకటించారు.