ప్యారిస్: లిఫ్టు తెగిపడిన శబ్దం విని.. అది బాంబు దాడేమోనని భయపడటంతో ప్యారిస్ డిస్నీలాండ్ లో వందలాది మంది తొక్కిసలాటలో నలిగిపోయారు. సెలవు కావడంతో చాలా ఎక్కువ మంది డిస్నీలాండ్ కు తమ పిల్లలతో వచ్చారు. అయితే అంతలో భారీ శబ్దం వినిపించింది. ఇటీవల ప్యారిస్ లో ఉగ్రవాద దాడులు జరగడంతో భయపడిన జనం.. ఇప్పుడు కూడా అలాంటిదే అయి ఉంటుందని భావించారు. కానీ, అక్కడ బహుశా లిఫ్లు లేదా ఎస్కలేటర్ సమస్య కారణంగా భారీ శబ్దం వినిపించిందని, దాన్ని విని అంతా భయపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.
ప్రజలంతా ఒక్కసారిగా బాగా కంగారు పడ్డారని, ఎవరికి వారే అటూ ఇటూ ఉరుకులు పరుగులు తీశారని అలెక్సియా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అందరూ అదేదో ఉగ్రదాడే అనుకున్నారని, కొద్ది నిమిషాల తర్వాత తమను వెనక్కి పంపేశారని, ఎటుచూసినా పోలీసులే ఉన్నారని ఆమె తెలిపారు. అయితే, అక్కడ ఎలాంటి ముప్పు లేదని భద్రతాదళాలు నిర్ధరించినట్లు ఫ్రాన్సు హోం మంత్రి ఓ ట్వీట్ ద్వారా చెప్పారు. ప్యారిస్ నగరానికి తూర్పుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిస్నీలాండ్.. యూరప్ లోనే పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతం.