హిమపాతానికి ఒకరు బలి

శ్రీనగర్, జనవరి 18: జమ్ము కాశ్మీర్‌లోని లద్ధాక్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి ఒక కారును కప్పేయడంతో ఒకరు మరణించారు. కారులోని మిగిలిన తొమ్మిది మంది మంచు కింద కూరుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగారు.
సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉన్న ఖర్దుంగ్‌లా కనుమ రహదారిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రపంచంలోని అతి ఎత్తయిన రహదారి మార్గాల్లో ఖర్దుంగ్ లా కనుమ ఒకటి. ఈ మార్గం షయోక్, సుబ్రా లోయలను కలుపుతుంది. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో మంచు అధికంగా కురుస్తోంది.
కాశ్మీర్‌లో ఈనెల 22 వరకు హిమపాతంతోపాటుగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం శ్రీనగర్‌లో మైనస్ 2.1 ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.