జ‌గ‌న్‌కు రాజ‌కీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్న బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, కీల‌క‌మైన ఉత్తరాంద్ర అభివృద్ధి కోసమే విశాఖలో రాజధాని అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు వే‌గంగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే, ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ అంశాల్లో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఉత్త‌రాంధ్ర సెంటిమెంట్‌తో వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేసే ఎత్తుగ‌డ‌ను తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబునాయుడు సమన్వయ సమావేశం నిర్వ‌హించ‌డం అందులో వివిధ అంశాల‌ను ప్ర‌స్తావించ‌డం దీనికి తార్కాణ‌మ‌ని ప‌లువురు చెప్తున్నారు.

జ‌గ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

అనూహ్య రీతిలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబునాయుడు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా రాజ‌కీయాలను ప్ర‌స్తావించారు. అక్రమాస్తుల కేసులో ఇంప్లీడ్ అయ్యారన్న కక్ష ఎర్రన్నాయుడు కుటుంబంపై, అశోక్ గజపతిరాజు కుటుంబంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పెట్టుకున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. అందుకే అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు నుండి తప్పించారు. అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్త‌రాంధ్ర‌కు ఏం చేశారు?

ఉత్తరాంధ్రపై వైసీపీకి ప్రేమ లేద‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఉత్తరాంధ్రలో అర్ధాంతరంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయరు. వచ్చిన పెట్టుబడులు తరిమేస్తారు. ఇదేనా వారి ప్రేమ అని విరుచుకుప‌డ్డారు. “శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో టీడీపీ ముద్ర చిరస్మరణీయం. తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన ప్రాంతాన్ని పునరుద్ధరించాం. అదే సమయంలో అక్కడే పాదయాత్ర చేస్తున్న జగన్ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. టీడీపీ హయాంలో రూ.1616 కోట్లతో వంశదార ప్రాజెక్టు వరదనీటి కాలువ పనులు చేపట్టాం. వంశధార-నాగావళి నదుల అనుసంధానం, బహుద-వంశధార అనుసంధానానికి నాంది పలికాం. మద్దువలస రిజర్వాయర్ కు, తోటపల్లి ఓల్డ్ కెనాల్ సిస్టమ్ కు సాగునీరు అందించాం. వైసీపీ వచ్చాక అన్ని పనులు ఆపేశారు. అభివృద్ధిని రివర్స్ చేశారు. ఉద్దానం తాగునీటి సమస్యకు ఒక పరిష్కారం చూపించాం. కిడ్నీ సమస్యల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి తెలుగుదేశం హయాంలో ఎంతో చిత్తశుద్ధి చూపించాం. కానీ.. నేడు జగన్ వ్యవసాయ బోర్లకు మీటర్లు అంటున్నారు.` అంటూ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఎమోష‌న్‌ల‌ను ట‌చ్ చేశారు.

ప్రజలు నమ్మేదెలా.?

“గతంలో రైతులకు విత్తనాల కొరత లేదు, విద్యుత్ కొరత లేదు, ఎరువుల కొరత లేదు. కానీ.. నేడు రైతులు అన్నింటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు కల్పించారు.  మెరుగైన వ్యవసాయం కోసం ప్రకృతి సేద్యానికి పిలుపునిస్తే.. జగన్ మోహ‌న్‌ రెడ్డి దాన్ని తొక్కిపెట్టారు. ఇలా ప్రతి విషయంలో రైతులను అవస్థలకు గురి చేసి.. ఏదో ఉద్దరించేస్తున్నట్లు మాట్లాడడం హేయం. మైండ్ గేమ్ ఆడుతున్నారు“ అంటూ మండిప‌డ్డారు.

అచ్చెన్నాయుడు సైతం…

ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అక్రమంగా త‌న‌ను ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలా మద్దతుగా నిలిచారని వెల్ల‌డించా. “జగన్ లాంటి దుర్మార్గ పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. అనేక సమస్యలు ఉన్నమాట వాస్తవం. టీడీపీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం.“ అని ప్ర‌క‌టించారు. కాగా, ఉత్త‌రాంధ్ర‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ ఎజెండాతో ముందుకు సాగుతున్న త‌రుణంలో ఆదిలోనే బ్రేక్ వేసేలా చంద్ర‌బాబు నాయుడు సెంటిమెంట్ రాజేస్తున్నార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.