నందమూరి బాలకృష్ణ హీరోగా కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే కెరీర్ అంటే హిట్స్ ఉంటాయి అలాగే ప్లాప్స్ కూడా ఉంటాయి. అలాగే బాలయ్యకు కూడా కెరీర్ లో ప్లాపులు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి. ప్లాపులు, డిజాస్టర్లు అంటే నిర్మాత నెత్తి మీద పిడుగు పడ్డట్లే.
అలాంటి ఒక బాలయ్య నిర్మాత ఇప్పుడు తన బాధను వెళ్లగక్కుతున్నాడు. ఒక సినిమా పోతే ఆ నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయన్న దానికి ఇది నిదర్శనం. వాకాడ అప్పారావు… ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ కొన్నేళ్ల క్రితం సినీ ప్రియులకు ఈ పేరు సుపరిచితమే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ కు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉండేవారు వాకాడ అప్పారావు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే అటు తెలుగులో ఇటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్న సంస్థ. మంచి అభిరుచి గల చిత్రాలను తీస్తారన్న పేరుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కేవలం డబ్బులు పెట్టి ఊరుకునేవారు. మిగతా వ్యవహారమంతా వాకాడనే చూసుకునేవారు అన్న పేరుంది. అలాంటి వాకాడ అప్పారావు సొంతంగా నందమూరి బాలకృష్ణ హీరోగా మహారథి అనే ఒక సినిమా తీసాడు. ఈ సినిమాతో ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వివరించారు. మహారథి సినిమా తీయడానికి ముందుకు కొంత మంది ఫైనాన్షియర్స్ వచ్చారని తెలిపారు. అయితే షూటింగ్ మధ్యలో ఉండగా వాళ్ళు చేతులెత్తేయడంతో డబ్బుల కోసం ఎక్కడెక్కడో చేతులు చాచాల్సి వచ్చిందని, ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు సినిమాకు డబ్బులు ఇచ్చేవాడినని, దాని కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశానని, ఆ సినిమా కోసం ఒక ఫైనాన్షియర్ గా వ్యవహరించానని తెలిపాడు వాకాడ. అయితే మహారథి సినిమా ఫలితం తేడా కొట్టింది. ఫలితంగా బోలెడన్ని అప్పులు మిగిలాయి. చాలా ఏళ్ల పాటు ఈ అప్పుల్ని తీర్చాను. ఇప్పటికీ ఒక ఫైనాన్షియర్ కు అప్పు తీరుస్తున్నాను అని తెలిపారు వాకాడ అప్పారావు.