బాలయ్యకు నో సపోర్ట్… మంచే జరిగింది?

సినీ వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి – మోహన్ బాబుకి మధ్య జరిగిన వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. సెలబ్రెటీలకు – లెజెండ్ లకూ మధ్య తేడా తెలిపే పుస్తకాన్ని వేయండంటూ మోహన్ బాబు నిప్పులు చెరిగిన సంగతి ఇప్పటికీ టాలీవుడ్ లో హాట్ టాపిక్కే అన్నా అతిశయోక్తి కాదేమో! అనంతరకాలంలో ఆ వ్యవహారం దాసరి లాంటి పెద్ద మనుష్యుల సమక్షంలో కాస్త సద్దుమణిగిందనే చెప్పాలి! ఆ సంగతులు అలా ఉంటే.. తాజాగా బాలయ్య – చిరంజీవి అన్నట్లుగా తెరపైకి వచ్చిన తాజా వ్యవహారం మరో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బాలయ్య తరుపున ఎవరూ సపోర్ట్ గా నిలవలేదనే వాదన బలంగా వినిపిస్తుంది… అది కూడా మంచే జరిగింది అనేది మరో కామెంట్!

ఒకవైపు కరోనా కష్టకాలం.. సినీ కార్మికులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయం.. షూటింగులు లేక చిన్న చితకా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నరకం చూస్తున్న వైనం… ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఒక కుదుపు వచ్చింది! చిరంజీవి ఆధ్వర్యంలో నలుగురు పెద్దలు కలిసి కేసీఆర్ ని కలవడం.. ఆ మీటింగ్ కి తనను పిలవలేదని బాలయ్య స్పందించడం చక చకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై నిర్మాత సి. కల్యాణ్ స్పందించినా… ఆ మీటింగుకు సంబందించిన మిగిలిన వారెవరూ (సీరియస్ / కూల్) స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం అక్కడితో ముగిసిపోతుందిలే అని అంతా భావించిన సమయంలో… నాగబాబు చేసిన ఓవర్ యాక్షన్ ఈ వ్యవహారాన్ని పీక్స్ కి తీసుకెళ్లిందనే చెప్పాలి!

బాలయ్యకు వార్నింగులు… పిచ్చికుక్క ట్వీట్లు (ఇది బాలయ్య గురించే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి మరి) వెరసి ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుందని అంతా భావించారు. ఈ సమయంలో బాలయ్య ఎంతో సంయమనంగా ఉన్నాడన్న సంగతి పక్కనపెడితే… ఆ సమయంలో బాలయ్యకి సరైన సపోర్ట్ ఉండి ఉంటే కచ్చితంగా ఈ వ్యవహారం అలానే అయ్యేది. కానీ… ఈ వ్యవహారంలో బాలయ్యకి ఎవరూ సపోర్ట్ రాలేదు అనే చెప్పాలి! అది కూడ మంచిదే అయ్యిందని.. అలాకానిపక్షంలో నాగబాబు లాంటివారు బాలయ్యకు మరో ఇద్దరు సపోర్ట్ చేసి ఉంటే… ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదముండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!