బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి..ఉద్రిక్తత

 

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ మరో 12గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో నేడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మినర్వా హోటల్ సమీపంలో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ వాహనాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తన డివిజన్‌లో బండి సంజయ్ యత్నిస్తున్నారంటూ ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని విజయారెడ్డి అక్కడకు చేరుకుని నిలదీశారు. దీంతో ఆయన అక్కడ నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా,  నగదుతో వచ్చి పంపిణీ చేస్తున్నారేమో సంజయ్ వాహనాన్నితనిఖీ చేయాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు.

 

టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను ఆయన వ్యక్తిగత కారులో ముందుకు పంపించారు. దాని వెనుకే సంజయ్‌కి పార్టీ కేటాయించిన కారు వెళుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులతో దాడి చేయగా ఆ వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుండి చెదరగొట్టారు. పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా ప్రచార పర్వం ముగిసిన వెంటనే రాజకీయ పార్టీలు డివిజన్‌లలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఒక పార్టీ నాయకుల పంపిణీని మరొక పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. నగదు పంపిణీ అడ్డుకుంటున్న  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రలోభాల పర్వంపై బీజెపీ, టీఆర్ఎస్ నేతలు పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకున్నాయి.