Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో హైదరాబాదీ ప్రముఖ వ్యాపార వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ని ఈడీ అరెస్టు చేసిన 48 గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసిఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల తొమ్మిదవ తేదీన ఢిల్లీలో విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ లు సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు గా తెలుపుతున్నాయి.

నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ కవిత పేరు ప్రస్తావనకు రావడం, తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ నెలలో సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వచ్చి ఒక పర్యాయం విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వరుసగా పెద్ద పెద్ద వ్యక్తులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అన్న ఆందోళన నెలకొని ఉంది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళన కల్గిస్తొంది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పిలుపు ఇచ్చారు. ఆ ధర్మాలో పాల్గొనవల్సి ఉన్న తరుణంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో కవిత ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున కవిత విచారణకు మరో తేదీకి మార్చాలని ఈడీ అధికారులను కోరతారా లేక అదే రోజు వెళతారా అనేది తెలియాల్సి ఉంది.