తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఏడో సీజన్‌కు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్-7కు సంబంధించి ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ సీజన్‌కు కూడా హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సీజన్-7 ప్రారంభం కానుంది.

అయితే బిగ్‌బాస్ సీజన్ 6 మొత్తం ఫేలవంగా సాగింది. కంటెస్టెంట్లు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారు. దాంతో షోకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అందుకే సీజన్-7ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి మొత్తంగా 20 మందిని దింపనున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే కొందరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రముఖ యూట్యూబర్ శీతల్ గౌతమన్ ఒకరు. యూట్యూబ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రల్లో నటిస్తూ పాపులర్ అయ్యారు శీతల్ గౌతమన్. యూట్యూబ్‌లో ఫెనేమీ, రెసిపీ, మోర్ దెన్ ఫ్రెండ్స్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించారు. ఇప్పుడు ఈ భామ బిగ్‌బాస్ సీజన్-7లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

శీతల్ జననం, విద్యాభ్యాసం..
1998 ఏప్రిల్ 26న శీతల్ గౌతమన్ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత బి.టెక్ అభ్యసించింది. చిన్నప్పటి నుంచే మోడలింగ్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే బి.టెక్ పూర్తయిన తర్వాత మోడలింగ్‌పై దృష్టి సారించింది. మోడలింగ్‌లో రాణిస్తూనే వరుసగా వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రముఖ యూట్యూబర్లు షణ్ముఖ్ జస్వంత్, మెహబూబ్ దిల్ సేలతో కలిసి నటించింది.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన క్రేజ్..
శీతల్ గౌతమన్‌కు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే. యూట్యూబ్‌లో 880కే, ఇన్‌స్టాగ్రామ్‌లో 235కే ఫాలొవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తుంటారు. రెసీపీ వెబ్ సిరీస్ నుంచి ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉంటాయి. వాటికి లక్షల్లో వ్యూవ్స్ ఉంటాయి.

కార్తీక దీపం ఫేమ్ ‘శోభా శెట్టి’
కార్తీక దీపం సీరియస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు శోభా శెట్టి దగ్గరయ్యారు. డాక్టర్ మోనితగా అందరికీ సుపరిచితురాలు. 2013లో కన్నడ టీవీ సీరియల్ ‘అగ్నిసాక్షితో తన కెరీర్ మొదలు పెట్టారు శోభా శెట్టి. ఈ సీరియల్‌లో ఆమె ‘తను’ పాత్రను పోషించారు. మొదటి సీరియల్ నుంచే మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. 2017లో కన్నడ చిత్రం ‘అంజని పుత్ర’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగులో 2017లో ‘అష్టా చెమ్మా’ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘అష్టా చెమ్మా’ సీరియల్‌కు శోభా శెట్టికి ‘ఉత్తమ నటి’గా స్టార్ మా పరివార్ అవార్డు, కార్తీక దీపం సీరియల్‌కు ‘ఉత్తమ ప్రతికూల పాత్ర’ కోసం స్టార్ మా పరివార్ అవార్డు వచ్చింది. అయితే తాజాగా శోభా శెట్టి కూడా బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.

సింగర్ మోహన భోగరాజు
తెలుగులో ‘బుల్లెట్ బండి’ పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్‌కు ప్రముఖ సింగర్ మోహన భోగరాజు పాడారు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల పాటలు పాడిన ఈ భామ.. తాజాగా బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి సీజన్‌లో సింగర్‌లకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఈ సారి సింగర్ మోహన భోగరాజుకు అవకాశం దక్కేటట్లు ఉంది.

యాంకర్ విష్ణుప్రియ..
తెలుగు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘పోవే పోరా’ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్, టీవీ రంగంలో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ క్రేజ్ ఎక్కువే. అయితే బిగ్‌బాస్ గత సీజన్‌లోనే ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ మరోసారి తెరపై ఆమె పేరు వినిపిస్తుంది. సీజన్-7లో విష్ణు ప్రియ కంటెస్టెంట్‌గా రానున్నట్లు తెలుస్తోంది.