బీజేపీది నమ్మక ద్రోహమే!

రామమందిర నిర్మాణం విషయంలో బీజేపీదీ నమ్మక ద్రోహమేనని శవసేన దుయ్యబట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టకుంటే…బీజేపీ దేశ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని అంగీకరించాల్సి ఉంటుందని శివసేన అధికారిక పత్రిక సామ్నా నేటి సంపాదకీయంలో పేర్కొంది. ఈ నమ్మక ద్రోహానికి బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది.  సుప్రీం కోర్టులో న్యాయప్రక్రియ పూర్తయ్యేంత వరకూ రామమందిర నిర్మాణం తన ప్రభుత్వానికే కాదు…ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొనడాన్ని సామ్నా సంపాదకీయం తప్పుపట్టింది. రాముడి పేరు చెప్పుకుని అధికారంలోనికి వచ్చిన మోడీ ఇప్పుడు రాముడి కంటే కోర్టులు గొప్పవని ఎట్లా చెబుతారని నిలదీసింది.