ఆ ఇద్దరు మహిళలకు బీజేపీ ఎంపీ మద్దతు

భక్తుల నిరసనలను ధిక్కరించి శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆయలంలోనికి ప్రవేశించిన ఆ ఇద్దరు మహిళలపై హిందుత్వవాదులు, సంఘ్ పరివార్ శక్తులు విరుచుకుపడుతున్నాయి. అలాగే బీజేపీ కూడా ఆ ఇద్దరు మహిళలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో వారికి అనూహ్యంగా ఒక పార్లమెంటు సభ్యుడి నుంచి మద్దతు దొరికింది.

ఆ సభ్యుడు బీజేపీ సభ్యుడు కావడం విశేషం. బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్  ఆ మహిళలకు మద్దతుగా చేసిన ట్వీట్ లో మగవాడు మహిళ నుంచే పడతాడని, అటువంటప్పుడు మగవాడు పవిత్రుడనీ ఆలయ ప్రవేశానికి అర్హడని అంటూ మహిళ అపవిత్రురాలని ఎలా అనగలమని ప్రశ్నించారు. అయితే ఇది పార్టీ అభిప్రాయం కాదనీ, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు.

భగవంతుడి ముందు స్త్రీ పురుషులిరువురూ సమానమేనన్నారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు నిన్న అయ్యప్ప ఆలయంలోనికి ప్రవేశించిన సంగతి విదితమే. మహిళల ఆలయప్రవేశానికి నిరసనగా ఈ రోజు కేరళ బంద్ జరుగుతున్న సంగతీ తెలిసిందే. మహిళల ఆలయ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ సొంత పార్టీ ఎంపీయే వారికి మద్దతుగా ట్వీట్ చేయడంతో ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఉదిత్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు.