Bollywood Drugs Case: బాలివుడ్ డ్రగ్స్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది. ఒక వైపు టాలివుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు వేగాన్ని పెంచగా అటు బాలివుడ్ ప్రముఖ నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. ముంబాయిలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం రాత్రి ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మాన్ ను ఎన్ సీబీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఆర్మాన్ కోహ్లీ ఇంటిపై ఎన్సీబీ అధికారులు నిర్వహించడం, ఆయన అరెస్టు ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలివుడ్ని డ్రగ్స్ కేసు కుదిపేసిన విషయం తెలిసిందే.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి వంటి నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. కొద్ది నెలల విరామం తరువాత మళ్లీ ఈ కేసుని తెరపైకి తీసుకురావడం, వెంటనే ఓ ప్రముఖ నటుడు అరెస్టు కావడం బాలివుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.