జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ పై పవన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నేతలు కౌంటర్ లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సబ్జెక్ట్ తో పాటు పార్టీ విధానం కూడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. రాజకీయాలు అంటే రెచ్చగొట్టడం కాదనే విషయం పవన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అసలు రాబోయే తరాలకు పవన్ ఏమి చెప్పదల్చుకున్నారని బొత్స ప్రశ్నించారు. కేఏ పాల్ కి పవన్ కళ్యాణ్ కు తేడా కనిపించడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎవడు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సన్నాసి మాటలు ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం అంటే పవన్ కు తెలియదన్నారు. రాజ్యాంగం, విలువలు తెలిస్తే అలాంటి సన్నాసి మాటలు అతని నోటి వెంట రావని అన్నారు. మాట్లాడకూడని మాటలు పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏమి లేని ఇస్తరాకు లాగ ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.

జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా పాలన సాగుతోందని బొత్స అన్నారు. ఎస్సీలకు జగన్ హయాంలో ఎంత మేర చేకూరిందో తెలుసుకోవాలన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నిధులను అందిస్తున్నామన్నారు. అదేమీ తెలియకుండా వాళ్లని కొడతా, వీళ్లని కొడతా అంటే సరిపోతుందా, ఇలాంటి మాటల ద్వారా ఈ సమాజానికి ఎమి చెప్పాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. తమ పార్టీ విధానం వికేంద్రీకరణేనని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలూ అబివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమనీ, మూడు రాజధానులు, 26 జిల్లాలు తమ విధానమనీ, అయిదు కోట్ల ప్రజల అభివృద్ధి తమ విధామని పేర్కొన్నారు. ఈ విషయం ఇంతకు ముందూ చెప్పామనీ, ఇప్పుడూ చెబుతున్నామని అన్నారు. పవన్ లాంటి వ్యక్తులను చూస్తుంటే ఈ రాజకీయాలపై విరక్తి కలుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ లకు ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే చాలన్నారు. వాళ్లది దోపిడీ విధానమనీ, తమది అభివృద్ధి విధానమని బొత్స పేర్కొన్నారు.
తనపై పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముందు వాళ్ల సీఎం అభ్యర్ధి ఎవరనేది క్లారిటీకి రావాలన్నారు. విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా తమకు ఒకేననీ, పవన్ రోల్ ఏంటో అందరికీ తెలుసునని అన్నారు. సబ్ ప్లాన్ దుర్వినియోగం ఆరోపణలపై పవన్ దగ్గర అధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ మాట్లాడతారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో చేసింది ఏమీ లేదు కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారని సజ్జల విమర్శించారు.
Read More: Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా .. ట్విస్ట్ ఏమిటంటే..?