మద్దతు మూన్నాళ్ల ముచ్చటేనా?

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇచ్చిన బీఎస్పీ..ఇప్పుడు మద్దతు ఉపసంహరించు కుంటానంటూ బెదిరిస్తున్నది. దీంతో మద్దతు మున్నాళ్ల ముచ్చటేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అన్నిటికీ మించి మాయావతి బీజేపీయేతర కూటమికి అనుకూలం అన్న వార్తలకు కూడా మద్దతు ఉపసంహరణ హెచ్చరిక చెక్ పెడుతున్నది. 2018 ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్ సందర్భంగా నమోదైన కేసులన్నిటినీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు బీఎస్పీ ఒక ప్రకటన విడుదల ేసింది. 2018 ఏప్రిల్ 2 జరిగిన భారత్ బంద్ లో పాల్గొన్న వారిపై ఎస్పీఎస్టీ చట్టం 1989 కింద నమోదు చేసిన కేసులన్నిటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం  చేసేలా సుప్రీం కోర్టు తీర్పు ఉందని పేర్కొంటూ దేశ వ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్ 28న దళిత సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త బంద్ జరిగిన సంగతి తెలిసిందే. బంద్ సందర్భంగా చెలరేగిన హింసాకాండలో పది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. కాగా సుప్రీం కోర్టు తన తీర్పు సమీక్షించేందుకు నిరాకరించి…ఆందోళనలకు పిలుపునిచ్చిన వారు తీర్పు చదివి ఉండరని అభిప్రాయపడింది. అయతే వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

బీఎస్పీ తాజా హెచ్చరిక మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఒకింత ఇబ్బంది కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన కాంగ్రెస్ కు ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బీఎస్పీ మద్దతు కీలకమైంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో మాయావతి పార్టీ హెచ్చరిక ఆ ఏర్పాటు యత్నాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.