కాల్ మనీ కేటుగాళ్లు మళ్ళీ వచ్చారు : జగన్ చూసుకో

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

ఉదయం 1000 ఇవ్వడం సాయంత్రం వచ్చి 1100 తీసుకువెళ్లడం.. రోజులో వెయ్యికి వంద వడ్డీ. లేవు అంటే రెండోరోజుకు అది 200 ఐతే మూడోరోజుకు 400 నాలుగోరోజుకు 800 వడ్డీ అవుతుంది. ఇదేం లెక్క అనుకోకండి. అదే కాల్ మనీ పేరిట సాగించే ఒక వికృత క్రీడ. ఇవ్వమంటే దౌర్జన్యం, కొట్లాట, బలవంతంగా ఆస్తులు కాజేయడం… అబ్బో ఒకటి కాదు. టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడ వేదికగా వెలుగుచూసిన కాల్ మనీ బకాసురుల అకృత్యాలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ప్రభుత్వాన్ని సైతం కుదిపేసే అంత రచ్చ జరిగింది. ఇప్పుడు అదే కాల్ మనీ కేటుగాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కి వచ్చేశారు. మారుతున్న సాంకేతికత తగ్గట్టుగా కొత్త కొత్త సంస్థ పేరుతో డైరెక్టుగా ఫోన్ లోనే ప్రత్యక్షమవుతున్నారు. ఆన్లైన్లో సులభంగా లోన్లు పొందొచ్చు అంటూ రకరకాల ప్రకటనలు ఇస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. అసలే కరువైన సమయంలో ఉద్యోగాలు ఊడి డబ్బులు లేని పరిస్థితుల్లో యువత సులభంగా వీరి ట్రాప్ లో చిక్కుకుంటున్నారు. అనంతరం వీరు వేసి వడ్డీలు భరించలేక మనోవేదనకు గురవుతున్నారు. కట్టకపోతే బండబూతులు శారీరక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతోపాటు పరువు తీసేలా ప్రవర్తనలు కంపెనీ రికవరీ ఏజెంట్లు చేస్తున్నారు. ఆన్లైన్ లోన్లు కట్టలేక ఇటీవల ఓ యువతి సూసైడ్ కూడా చేసుకోవడం మీడియాలో వచ్చింది. అయితే ప్రభుత్వాలు దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ లోన్లు దందా పేరుతో కాల్ మనీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

తిడతారు… కొడతారు.. పరువు తీస్తారు!!

కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆధారంగా లోన్లు ఇస్తామని ఎర వేసే సంస్థలు కొత్తకొత్త కంపెనీల పేరుతో దర్జాగా యాప్ లను తయారు చేసి మార్కెట్లో ప్రమోషన్ మొదలు పెడుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా అప్పులు ఇస్తామని చెబుతున్నాయి. వడ్డీ కూడా అతి తక్కువ చూపడంతో ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నారు. డబ్బులు అప్పుగా తీసుకున్న తర్వాత అసలు వడ్డీల సెక్షన్ మొదలవుతుంది. ఇచ్చిన అమౌంట్ కు అంతే స్థాయిలో వడ్డీ కూడా తీసుకున్నవారు అవాక్కవుతారు. ఇక వడ్డీని అసలును అనుకున్న సమయానికి కట్టకుంటే రికవరీ ఏజెంట్ల రంగంలోకి దిగుతారు. అసభ్య పదజాలం బూతులు ఉపయోగిస్తూ మానసికంగా హింసిస్తారు. ఇంకాస్త మాటా మాటా పెరిగి తే శారీరక దాడులకు దిగుతున్నారు. మహిళలను రికవరీ ఏజెంట్లుగా దించుతూ ఇళ్ల పైకి పంపుతున్నారు. అక్కడ ఎలాంటి గొడవ జరిగిన మహిళా రికవరీ ఏజెంట్ల చేత పోలీసు కేసులు పెట్టించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ముఖ్యంగా దీనిలో చెప్పుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ వర్గాలవారిని రికవరీ ఏజెంట్ గా పెట్టుకొని, వారిని రుణ గ్రహీతలు తిట్టినట్లు గా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక సాంకేతికతను ఉపయోగించుకొని రుణ గ్రహీత పరువును బజారుకీడుస్తున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ఉన్న చిత్రాలను రుణ గ్రహీతల బంధువులకు కుటుంబ సభ్యులకు పంపి ఫ్రాడ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అప్పు తీసుకున్న వారు కట్టలేక, ఈ మానసిక వేధింపులు తాళలేక బలవన్మరణానికి సైతం ప్రయత్నిస్తున్నారు. అలాంటివి తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా నిత్యం జరుగుతున్నాయి.

రిజర్వ్ బ్యాంకు అనుమతులున్నాయా?

ఆర్థిక పరమైన లావాదేవీలు సంస్థలు నడుపుతున్న సమయంలో కచ్చితంగా వాటికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. ఇటు ప్రభుత్వ పరంగానూ అనుమతి ఉండాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య స్వల్ప డబ్బుల విషయంలో కేవలం ప్రామిసరీ నోట్ ల వరకు సరిపోతుంది. అయితే సంస్థలకు వచ్చేసరికి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి వ్యాపారం చేస్తున్న అది ఎంత టర్నోవర్ ఎవరికి ఏమిటి దాని యజమాని ఎవరు అనేక కీలక అంశాలను పొందుపరిచి రిజర్వు బ్యాంకు వద్ద అనుమతి తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ సైతం అప్లికేషన్ పెట్టుకోగానే అనుమతులు ఇవ్వదు. ఆ సంస్థ మనుగడ ఆ సంస్థ పరిస్థితి ఆర్థిక అంశాలు అన్ని పరిగణలోకి తీసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మాత్రమే అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో కనిపిస్తున్న లోన్ యాప్ లు ఏవి రిజర్వుబ్యాంకు అనుమతితోనే కోకుండా వ్యాపారం చేసుకుంటున్నవే. దాదాపు ఎవరికీ రిజర్వుబ్యాంకు అనుమతులు లేవు. యాప్ ను సృష్టించడం, ఆన్లైన్లో ప్రమోషన్ చేస్కోవడం, యధేచ్చగా అప్పులు ఇవ్వడం, రికవరీ ఏజెంట్ల పెట్టి వసూలు చేసుకోవడంతోనే సరిపోతుంది. దీనిపై కొన్నిచోట్ల బాధితులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన పోలీసుల నుంచి సరైన మద్దతు రాలేదు. అప్పు తీసుకుంటే కట్టాలి గా… కట్టని వాడివి ఎందుకు తీసుకున్నావ్ అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో బాధితులు ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మానసిక వేదనకు గురవుతున్నారు.

న్యాయపరంగా పోరాడోచ్చు

భారతదేశ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు బాధ్యతలను ఇచ్చింది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను కాపాడడం మొదటి విధి. దీని ప్రకారం ఆన్లైన్ లో జరుగుతున్న వడ్డీ మానసిక వేధింపులను న్యాయపరంగా ఎదుర్కోవచ్చు. అప్పు ఇచ్చిన కంపెనీల పరిస్థితి వాటి తీరును కోర్టుకు విన్నవించింది ప్రైవేటు కేసులు వేయవచ్చు. అంతా మూకుమ్మడిగా వేసే కంటే బాధితులంతా కలిపి ఒక్కొక్కరు ఒక్కో కేసు వేస్తే దీంట్లో మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ప్రాధాన్యం పెరుగుతుంది. కంపెనీ చేస్తున్న ఆకృత్యాలను సాక్ష్యాధారాలతో సహా కోర్టు విన్నవిస్తూ పోలీసులను కోర్టు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుంది. లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేయవచ్చు. దీనిలో మొత్తం బాధితుల అంతా ఇంప్లీడ్ అవ్వచ్చు. ఒకవేళ పిల్ను హైకోర్టులో వేసి హైకోర్టు కనుక దీనిని విచారణకు అనుమతించి సాక్ష్యాధారాలను పరిశీలిస్తే ఎన్నో కుటుంబాలు ఆనంద పడతాయి.

జగన్ దృష్టి పెడితే…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ లను, ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ప్రత్యేకమైన ఉత్తర్వులను తీసుకొచ్చారు. బెట్టింగ్ జూదం సంబంధిత యాప్లు ఆంధ్రప్రదేశ్లో వాడితే ఊరుకోమని దీనికి ప్రత్యేకమైన విధివిధానాలను చట్టాన్ని తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పనిలోపనిగా ముఖ్యమంత్రి జగన్ ఆన్లైన్ రుణాల పైన దృష్టి పెడితే ఎంతో మేలు చేసినట్లే అవుతారు. దీనికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఆన్లైన్లో ఇష్టానుసారం వడ్డీ వ్యాపారం చేస్తున్న కాల్ మనీ బకాసుర పై జగన్ ప్రభుత్వం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు పూస్తాయి. ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సాధించడమే మిగిలి ఉంది.