జగన్‌ పిటిషన్‌పై తీర్పు రీజర్వ్!

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఈ కేసులో నవంబర్ 1వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఆయన తరఫు న్యాయవాదులు, అలాగే సీబీఐ తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని,  ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు రావాలంటే ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని, అలాగే విధి నిర్వహణలో చాలా ఆటంకాలు కలుగుతాయని ఆయన తరఫు లాయర్ వాదించారు. జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం సీబీఐ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అంశాన్ని ప్రధానంగా  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగన్ గతంలో కూడా వ్యక్తి గత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జగన్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇస్తే.. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని సీబీఐ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ, నవంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.