YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని అధికారుల బృందం అవినాష్ రెడ్డిని విచారణ చేస్తొంది. అయితే తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలన్న అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తిరస్కరించారు. విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఒక కంక్లూజన్ కు వచ్చిన సీబీఐ అధికారులు కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది.

ఈ కేసులో సాక్షాలు రూపుమాపే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా, నిందితులకు మద్దతుగా నిలిచినట్లుగా ఉన్నారనీ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో సిబీఐ పేర్కొన్నది. ఈ తరుణంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తుండటంతో ఏమైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. మరో పక్క అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఎటువంటి గొడవలు జరగకుండా అవినాష్ అనుచరులను సీబీఐ కార్యాలయ పరిసరాల నుండి పోలీసులు పంపించారు. గత నెల 28న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటల పాటు తొలి సారిగా విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవినాష్ కాల్ డేటా ఆధారంగా ఈ నెల 3న నవీన్, కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు కడపలో విచారించారు. అవినాష్ రెడ్డి మాత్రం ఈ హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదనీ, నిస్పక్షపాతంగా విచారణ చేసి అసలైన దోషులను పట్టుకోవాలని కోరుతున్నారు. తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.