సిబిఐ మొరపై రేపు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం నేపధ్యంలో కోల్‌కతాలో నిన్న సిబిఐకి, రాష్ట్ర రాజధాని పోలీసులకూ మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో కోల్‌కతా పోలీసు కమిషనర్ నిందితుడు కావచ్చనీ, ఆయన వద్ద ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ సిబిఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలనీ కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు దానిపై  మంగళవారం విచారణ చేపట్టనుంది. నేడే విచారణ చేపట్టాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరినా అందుకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అంగీకరించలేదు.

సుప్రీంకోర్టు ఆదేశానుసారం శారదా చిట్‌ఫండ్ స్కామ్, రోజ్‌వాలీ స్కామ్‌లపై జరుపుతున్న దర్యాప్తునకు రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని సిబిఐ ఆరోపిస్తున్నది. నిన్న కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను విచారించేందుకు అకస్మాత్తుగా ఆయన ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులకు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురయింది.

కమిషనర్ రాజీవ్ కుమార్‌కు బాసటగా నిలబడ్డ మమతా బెనర్జీ, మోదీ నేతృత్వంలో కేంద్రం నియంతృత్వ విధానాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఆ విధానాలకు నిరసనగా ఆమె కోల్‌కతా వీధుల్లో ధర్నాకు దిగారు. కమిషనర్ ఇంటికి సిబిఐ అధికారులు వారెంట్ లేకుండాఎలా వెళతారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పావుగా వాడుతున్నదని ఆమె ఆరోపిస్తున్నారు.