రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నర సంవత్సరాలు దాటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్) ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలను నమోదు చేసుకుంది. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, నిరుద్యోగులు అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేసింది. ఏపిలో తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీలుగా ఉన్న దీపక్ రెడ్డి(అనంతపూర్), బీటెక్ రవి (కడప)ల పదవీ కాలం ఈ నెల 29వ తేదీన ముగియనుండగా, వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు), అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణరాజు (వెస్ట్ గోదావరి), చిక్కాల రామచంద్రరావు(ఈస్ట్ గోదావరి జిల్లా), శత్రుచర్ల విజయరామరాజు (శ్రీకాకుళం), బీఎన్ రాజసింహులు(చిత్తూరు), కెఇ ప్రభాకర్ (కర్నూలు) పదవీ కాలం ఈ ఏడాది మే 1వ తేదీతో ముగియనున్నది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం స్థానాలకు ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాయి.