23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

కృష్ణంరాజుకు మృతికి ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం .. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Share

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రిలో కృష్ణంరాజు తుది శ్వాస విడవగా కొద్ది సేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి కృష్ణంరాజు భౌతికకాయాన్ని తరలించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, మోహన్ బాబు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, తదితర సినీ ప్రముఖులు, కేంద్ర మంత్రి కిరణ్ రెడ్డి, తదితర సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు కృష్ణంరాజు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులను నిలువరిస్తున్నారు.

PM Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ తదితరులు ట్విట్టర్ వేదికగా కృష్ణంరాజు మృతికి సంతాపం తెలియజేశారు. మోడీ, అమిత్ షా లు తెలుగులో తమ సంతాపాన్ని తెలియజేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను పీఎం మోడీ షేర్ చేశారు. “శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అంటూ మోడీ ట్వీట్ చేశారు.

ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా .. “తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ యు కృష్ణంరాజు గారు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశారు. * ఏపీ సీఎం వైఎస్ జగన్ .. “కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా” నంటూ ట్వీట్ చేశారు.

తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని తెలంగాణ సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని కేసిఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కేసిఆర్ తెలియజేశారు. తనకు కృష్ణంరాజు ఆప్త మిత్రుడుగా పేర్కొన్న కేసిఆర్.. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. రేపు కృష్ణంరాజు పార్ధివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం కృష్ణంరాజు పార్ధివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ఫిలింనగర్ క్లబ్ కు కృష్ణంరాజు భౌతికకాయాన్ని తరలించి కొద్దిసేపు ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

టాలీవుడ్ లో విషాదం .. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

 


Share

Related posts

Kajal: కుమారుడికి క్యూట్ నేమ్ పెట్టేసిన కాజ‌ల్ దంప‌తులు..ఇంత‌కీ ఏం పేరంటే?

kavya N

పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఎంతో రాబడి పొందవచ్చో తెలుసా?

Teja

మరో మేకింగ్ రాబోతోంది

Siva Prasad