అభ్యర్థుల ఎన్నికల వ్యయం పది శాతం పెంపు..!!

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం బీహార్ అసెంబ్లీలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా మారింది. ఎంపి, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎన్నికల ఖర్చును గతం కంటే పది శాతం పెంపుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం సవరించింది.

దేశంలోని 25 రాష్ట్రాల్లో లోక్ సభ సభ్యులకు 77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు రూ.30.80లక్షల వ్యయంగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కింలతో పాటు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (తక్కువ జనాభా) లోక్ సభ స్థానాలకు 59.40లక్షలు, అసెంబ్లీ స్థానాలకు 30.80 లక్షలుగా కేంద్ర న్యాయశాఖ ఖరారు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించే ఎన్నికల నిర్వహణ 1961 నిబంధనలను సవరించినట్లు కేంద్ర న్యాయశాఖ పేర్కొన్నది. ఈ నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లోక్‌సభకు 70లక్షలు, రూ.54లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ.28లక్షలు, 20లక్షలు అభ్యర్థులు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది.