న్యూస్

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

Share

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేదం విధించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి కొనుగోలు చేసిన కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిషేద ఉత్తర్వుల కారణంగా ఎక్సేంజీ ద్వారా ఏపి, తెలంగాణ సహా 13 రాష్ట్రాల డిస్కంలు విద్యుత్ కొనుగోలు, మిగులు విద్యుత్ అమ్మకాలకు వీలుకాదు. కేంద్ర నిషేద చర్యలను ఉపసంహరించే వరకూ డిస్కంలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాయి. కేంద్రం నిషేదించిన వాటిలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ గఢ్, జమ్ముకశ్మీర్, బీహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. ఈ నిషేద ఉత్తర్వుల కారణంగా తలెత్తే విద్యుత్ లోటు వల్ల తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను విధించే అవకాశం ఉంది.

 

కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్ నుండి లేట్ పేమెంట్ సర్ చార్జీ  (ఎల్‌పీఎస్) నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనల్లో భాగంగా ప్రత్యేక పోర్టల్ ను కేంద్రం రూపొందించింది. ఇందులో వివిధ రాష్ట్రాలు డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్, చెల్లించాల్సిన బిల్లు మొత్తాలను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్ లోడ్ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జూలై, ఆగస్టు నెలల్లో డిస్కంలు తీసుకున్న విద్యుత్ బిల్లులను ఇంథన ఉత్పత్తి సంస్థలు పోర్టల్ లో అప్ లోడ్ చేశాయి. అప్ లోడ్ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు చేపట్టింది. వాస్తవానికి బిల్లు ఇచ్చిన తర్వాత 45 రోజుల వరకూ చెల్లింపు వ్యవధి ఉంటుంది. ఈ లోగా సరఫరా చేసిన విద్యుత్ ఎంత, బిల్లులో పేర్కొన్న విధంగా యూనిట్ ధరలు ఉన్నాయా ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్పత్తి సంస్థలకు బిల్లులను చెల్లిస్తుంటాయని డిస్కంలు పేర్కొంటున్నాయి.

 

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిశీలించి నిషేదిత జాబితా నుండి శుక్రవారం లోగా ఏపి డిస్కం ను తొలగించే అవకాశం ఉందని ఈ రాష్ట్ర అధికారులు పేర్కొంటున్నారు. డిస్కంలు చేసిన చెల్లింపుల సమచారం యాప్ లో అప్ లోడ్ కాకపోవడం వల్ల డిస్కంలు సుమారు రూ.5వేల కోట్ల బకాయిలు ఉన్నట్లుగా యాప్ చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రూ.1600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా చూపుతోంది. విద్యుత్ ఎక్సేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ రాష్ట్ర ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు విద్యుత్ ఎక్సేంజీకి లేఖ రాశారు. మరో పక్క ఆదివారం లోగా సమస్య పరిష్కారం కాకపోతే  సోమవారం ఈ సమస్యపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్దమవుతున్నారు.


Share

Related posts

ఏ తొలి ప్రేమ గురించి..!

somaraju sharma

Guppedantha Manasu: ఖుషీగా సాగిన ఎపిసోడ్.. గౌతమ్, వసుధారలు రిషితో ఓ ఆట ఆడుకుంటారు!

Ram

రామ్ చరణ్ కోరిక తీరాలంటే ఇదే చివరి అవకాశం.. లేదంటే జన్మలో జరగదు !

Naina